September 13, 2013

భాజపా ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ... భాజపా నిర్ణయం


భాజపా తరఫున ప్రధాని అభ్యర్థిగా నరేంద్ర మోడీని భాజపా అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ అధికారికంగా ప్రకటించారు. శుక్రవారం సాయంత్రం ఢిల్లీలో సమావేశమైన పార్లమెంటరీ బోర్డు సమావేశంలో రాజ్ నాథ్ ప్రకటన చేస్తూ నరేంద్ర మోడీ తమ పార్టీ తరపున 2014 ఎన్నికల్లో ప్రధానమంత్రి అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారని చెప్పారు.

అనంతరం నరేంద్ర మోడీ మాట్లాడుతూ... తాను పార్టీలో ఓ కార్యకర్తగా చేరాననీ, వివిధ స్థాయిల్లో పనిచేశానన్నారు. అంచెలంచెలుగా పార్టీలో వివిధ పదవులను అధిష్టించిన తనకు పార్టీ మరోసారి పెద్ద బాధ్యతను అప్పగించిందన్నారు. కాశ్మీరు నుంచి కన్యాకుమారి వరకూ కార్యకర్తల ఆకాంక్షను భాజపా నెరవేరుస్తుందని అన్నారు.

ప్రస్తుతం దేశం ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటోందనీ, అవన్నీ భాజపా అధికారంలోకి వస్తేనే పరిష్కారమవుతాయని వ్యాఖ్యానించారు. కాగా మోడీ ఎంపిక పట్ల అద్వానీ కినుక వహిస్తున్నారన్న నేపధ్యంలో ప్రధానమంత్రి అభ్యర్థిగా ఎంపికయిన మోడీ నేరుగా అద్వానీ ఇంటికి వెళ్లి ఆశీర్వాదాలు తీసుకునేందుకు వెళుతారని సమాచారం.

No comments:

Post a Comment