హైదరాబాద్ ఫై ప్రత్యామ్నాయ ప్రతిపాదనలు

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 7: విభజన ఆందోళనల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో రాష్టప్రతి పాలన విధించే ప్రతిపాదనేదీ ప్రభుత్వ పరిశీలనలో లేదని హోంమంత్రి సుశీల్‌కుమార్ షిండే స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి తయారవుతున్న కేబినెట్ నోటు తుదిరూపం దిద్దుకున్న తరువాతే విద్య, ఉపాధి, నీటి వనరుల పంపకం వంటి కీలక అంశాలపై ఒక అవగాహన ఏర్పడుతుందని శనివారం తన శాఖకు సంబంధించిన నెలవారీ నివేదికను విడుదల చేస్తూ మీడియాకు వెల్లడించారు. రెండు ప్రాంతాల వారికీ అత్యంత ప్రతిష్టాత్మకంగా మారుతున్న హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటిస్తారా? అన్న ప్రశ్నకు ఈ విషయమై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. హైదరాబాద్‌కు సంబంధించి రెండు మూడు ప్రతిపాదనలు పరిశీలనలో ఉన్నాయని అన్నారే తప్ప, అవి ఏమిటన్నది స్పష్టం చేయలేదు. తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకిస్తూ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి రాజీనామా చేస్తానని ఎన్నడూ చెప్పలేదని షిండే స్పష్టం చేశారు. తెలంగాణ ఏర్పాటుపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తుది నిర్ణయం తీసుకుంది. తన నిర్ణయాన్ని ప్రభుత్వానికి తెలియచేయటంతో నోటు తయారీపై సంబంధిత శాఖలు నిమగ్నమై ఉన్నాయి అన్నారు. హోం శాఖ నోటు తయారీలో ఉందని వెల్లడించారు. సీమాంధ్రలో సమైక్యాంధ్రకు అనుకూలంగా జరుగుతున్న ఉద్యమ తీవ్రతను దృష్టిలో పెట్టుకుని విభజనపై పునరాలోచన చేసే అవకాశాలు ఉన్నాయా? అన్న ప్రశ్నకు ఆయన జవాబు ఇవ్వలేదు. అయితే వర్కింగ్ కమిటీ తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా నోటు తయారు చేస్తున్నామని చెప్పారు. నోటు ఎప్పటికి పూర్తవుతుందన్న ప్రశ్నకు వేచి చూడండని బదులిచ్చారు. వివిధ వర్గాల అభిప్రాయాలను తెలుసుకోవటానికే పార్టీ నాయకత్వం ఆంటోనీ కమిటీని నియమించిందని చెప్పిన షిండే, ప్రభుత్వ కమిటీని ఏర్పాటు చేయాలన్న వివిధ రాజకీయ పార్టీల డిమాండ్‌పై స్పందించ లేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ఐదారు నెలల్లో పూర్తి అయిపోతుందని గతంలో మీరు చేసిన ప్రకటన పరిస్థితి ఏమిటి? అని ప్రశ్నించగా రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని సిడబ్ల్యుసి మొదటి నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు రెండవ దశగా కేబినెట్ నోటు తయారీ ప్రక్రియ మొదలైంది. మిగిలిన ఘట్టాల కోసం నిరీక్షించక తప్పదని స్పష్టం చేశారు. సీమాంధ్రలో నలభై రోజులుగా జరుగుతున్న ఆందోళనపై పూర్తి సమాచారం తమకుందని చెప్పారు. శాంతి భద్రతల పరిస్థితిపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. ఎపి ఎన్జీవోలు శనివారం హైదరాబాద్‌లో నిర్వహించిన సభ శాంతియుతంగానే ముగిసిందని షిండే తెలిపారు.
No comments:
Post a Comment