August 31, 2013

పోటాపోటీ ప్రదర్శనలు


హైదరాబాద్, ఆగస్టు 30: సచివాలయంలో శుక్రవారం కూడా సీమాంధ్ర, తెలంగాణ ప్రాంతానికి చెందిన ఉద్యోగుల పోటాపోటీగా ఆందోళనలు, ధర్నాలు నిర్వహించారు. దీంతో వివిధ ప్రభుత్వ శాఖల కార్యాలయాలు బోసిపోయాయి. జె-బ్లాక్ వద్ద సీమాంధ్ర ప్రాంత ఉద్యోగుల సంఘం కన్వీనర్ మురళీకృష్ణ ఆధ్వర్యంలో ఉద్యోగులు, ప్రధాన ద్వారం వద్ద సచివాలయం తెలంగాణ ప్రాంత ఉద్యోగులు ధర్నా చేశారు. రాష్ట్ర విభజన అనుకూల, వ్యతిరేకంగా పరస్పరం నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సీమాంధ్ర ప్రాంత ఉద్యోగుల సంఘం కన్వీనర్ మురళీకృష్ణ మాట్లాడుతూ రాష్ట్ర విభజనను కేంద్రం ఏకపక్షంగా రుద్దితే తీవ్ర పరిణామాలు ఏర్పడుతాయని, తాము తెలంగాణ ఏర్పాటుకు వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్ రాజధాని కావడం వల్ల పెద్ద ఎత్తున ఉద్యోగులు, ప్రజలు ఇక్కడకు వచ్చి స్ధిరపడ్డారని, ప్రస్తుతం విభజన జరిగితే ఉద్యోగుల హక్కులు, పిల్లల భవిష్యత్తు ఏమిటని ప్రశ్నించారు. తాము శాంతియుతంగా ఉద్యమాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. సచివాలయ తెలంగాణ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు నరేంద్రరావు మాట్లాడుతూ సీమాంధ్ర ఉద్యోగులు తెలంగాణ కల సాకారమయ్యే వేళ తమకు అడ్డుపడరాదని కోరారు. సీమాంధ్ర ఉద్యోగులకు భద్రతకు వచ్చిన ముప్పేమీ లేదన్నారు. హైదరాబాద్ అందరిదని, ఒక ప్రాంతం వారిది కాదన్నారు. తెలంగాణ ప్రాంతంపై ఆధిపత్య ధోరణి పోతుందనే అక్కసుతోనే సీమాంధ్ర ఉద్యోగులు ఆందోళన చేస్తున్నారని, వారికి ప్రత్యేకమైన అజెండా అంటూ ఏమీ లేదన్నారు. తమ హక్కులకు భంగం వాటిల్లుతుందనే ముసుగులో తెలంగాణను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆయన విమర్శించారు. హైదరాబాద్ మాది అంటే ఊరుకునే ప్రసక్తి లేదన్నారు. సచివాలయంలో ఇరుప్రాంతాల ఉద్యోగుల పోటాపోటీ ప్రదర్శనల సందర్భంగా పోలీసు బలగాలను పెద్దఎత్తున మెహరించారు.
సచివాలయంలో శుక్రవారం పోటాపోటీ నిరసనలు చేపట్టిన తెలంగాణ, సీమాంధ్ర ఉద్యోగులు

No comments:

Post a Comment