November 13, 2013

తెలంగాణ అధికారాల్లో వేలు పెట్టొద్దు : కేసీఆర్


ఉమ్మడి రాజధాని ఐదేళ్లు చాలు
ఆంక్షలు పెడితే అవమానించినట్లే
జీవోఎంకు కేసీఆర్ స్పష్టీకరణ
బిల్లు ఆమోదం తర్వాతే విలీన యోచన

న్యూఢిల్లీ, నవంబర్ 12 : "తెలంగాణ రాష్ట్రాన్ని తక్షణం ఏర్పాటు చేయండి. అదే సమయంలో.. దేశంలోని 28 రాష్ట్రాలకు ఏయే అధికారాలు ఉన్నాయో అవే అధికారాలను తెలంగాణకూ ఇవ్వాలి. తెలంగాణ ప్రభుత్వ అధికారాల్లో కేంద్రం వేలెట్టకూడదు'' అని మంత్రుల బృందానికి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్పష్టం చేశారు. హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా ఐదేళ్లు మాత్రమే ఉంచాలని చెప్పారు. జీవోఎంతో భేటీ తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడారు. "తెలంగాణ ప్రజలు ఎలాం టి రాష్ట్రాన్ని కోరుతున్నారో జీవోఎం సభ్యులకు చెప్పా ను.శాంతి భద్రతలని, మరొకటని, మరొకటని ఈ మధ్య వింటూ ఉన్నాం. పేపర్లలో చూస్తున్నాం. అలాంటివేమీ పెట్టొద్దని చెప్పాను.
భారతదేశంలో తెలంగాణ 29వ రాష్ట్రం అవుతుంది. మిగతా 28 రాష్ట్రాలకూ, కేంద్రానికి మధ్య ఎలాంటి సంబంధాలున్నాయో అలాంటి కేంద్ర-రాష్ట్ర సంబంధాలే ఉండాలి. అంతేతప్ప ఏ రకమైన ఇతర పద్ధతినీ అవలంభించకూడదని, అలా చేస్తే తెలంగాణ సమాజం అంగీకరించదని చాలా స్పష్టంగా చెప్పాను'' అని వివరించారు. శాంతి భద్రతలు, నీటి పంపకాలు, హైదరాబాద్ స్థితి, ఐదేళ్ల ఉమ్మడి రాజధాని, ఉద్యోగాలకు సంబంధించి తమ వైఖరిని చాలా స్పష్టంగా చెప్పానని, మంత్రుల బృందం స్పందన చాలా అనుకూలంగా ఉందని తెలిపారు. ప్రక్రియను కూడా వీలైనంత త్వరగా ముగించాలని భావిస్తున్నామని జీవోఎం సభ్యులు చెప్పారన్నారు. ఉమ్మడి రాజధానిలో రెండు ప్రభుత్వాలు నడుస్తాయని, గవర్నర్ పాలన, ఇతర అంశాలేమీ తమకు అంగీకారం కాదని చెప్పానన్నారు. జీవోఎంతో భేటీకి టీడీపీ రాకపోతే చంద్రబాబు తన తెలంగాణ వ్యతిరేకతను స్పష్టంగా బయటపెట్టుకున్నట్లేనని, అందులో అనుమానమే లేదని విమర్శించారు. ఏ కారణం చేత బాబు రాలేడో స్పష్టంగా చెప్పాలని, ఏదో ఒక వైఖరి తీసుకుని దానిని జీవోఎంకు చెప్పాలని డిమాండ్ చేశా రు. "సమ న్యాయం అన్నా డు. అదైనా చెప్పాలి. డిమాండ్ లేకుండా ఢిల్లీ వచ్చి నిరాహార దీక్ష చేసిన గొప్ప నాయకుడు చంద్రబాబు. ఇక ఆయనకు ఎంత జ్ఞానం ఉందో తెలుసుకోవచ్చు. జీవోఎం పిలిస్తేనే రాలేదంటే.. ఒక మాజీ ముఖ్యమంత్రివి, ప్రతిపక్ష నాయకుడి వి.. నీకు బ్రెయి న్ ఉందా? దొబ్బిందా? ప్రజలే అర్థం చేసుకుంటారు. అది ఆయన ఖర్మ'' అని ధ్వజమెత్తారు.

No comments:

Post a Comment